ట్రాన్స్ జెండర్ల పేరు, లింగ మార్పుపై కోర్టు కీలక తీర్పు... 12 d ago
కర్ణాటక హైకోర్టు ట్రాన్స్జెండర్ బర్త్ , డెత్ సర్టిఫికెట్లో పేరు, లింగం మార్పు చేయడంపై కీలకమైన తీర్పును ఇచ్చింది. బర్త్ , డెత్ నమోదు చట్టం- 1969ను ట్రాన్స్జెండర్ పర్సన్స్ (రక్షణ హక్కులు) చట్టం- 2019 తో వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రాన్స్జెండర్ పేరు, లింగం మార్పు చేయాలంటే ట్రాన్స్జెండర్ చట్టం 6వ ,7వ సెక్షన్ల ప్రకారం అవసరమైన సర్టిఫికెట్లను సమర్పిస్తే బర్త్ , డెత్ సర్టిఫికెట్లలో మార్పు చేయాలని ఆదేశించింది.
రాష్ట్రానికి చెందిన ఒక ట్రాన్స్జెండర్ లింగ సర్జరీ అనంతరం తన జనన ధ్రువపత్రంలో పేరు , లింగం మార్పునకు దరఖాస్తు చేసుకుంది. ఆమె ఆధార్, పాస్ పోర్ట్ వంటి ఇతర గుర్తింపు డాక్యుమెంట్లలో మార్పులు చేయించినప్పటికీ, బర్త్ సర్టిఫికెట్ మార్చడానికి సంబంధించిన దరఖాస్తును ప్రభుత్వం అనుమతించలేదు. ఎందుకంటే జనన మరణాల చట్టం 1969 ప్రకారం ఇలాంటి మార్పు చేయడానికి వీలులేదని రిజిస్ట్రార్ తెలిపారు. దీంతో ట్రాన్స్ జెండర్ కోర్టును ఆశ్రయించింది.
వాదనలు విన్న న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్.. ట్రాన్స్జెండర్ చట్టం ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులకు పేరును, లింగాన్ని అధికారిక రికార్డుల్లో మార్చుకునే హక్కు ఉందని తెలిపారు. కానీ 1969 చట్టంలో ఈ మార్పును అంగీకరించే విధానం లేదని, అందువల్ల కోర్టు రిజిస్ట్రార్ను ట్రాన్స్జెండర్ చట్టం ప్రకారం మార్పు కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేసి, మార్పు చేసిన బర్త్ సర్టిఫికెట్ ని జారీ చేయాలని ఆదేశించింది.
1969 చట్టంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులను సరిగా ప్రతిబింబించే మార్పులు సూచించాలని కోర్టు కోరింది. రాష్ట్రం ట్రాన్స్జెండర్ హక్కులను రక్షించాల్సిన బాధ్యతను కోర్టు గుర్తించింది. ఈ తీర్పు కర్ణాటకలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల న్యాయపరమైన గుర్తింపును, రక్షణను పెంచేందుకు ముఖ్యమైన మలుపుగా నిలవనుంది.